Tuesday, 21 August 2012

బాబా ఆమ్టే

బాబా ఆమ్టే

బాబా ఆమ్టే - ఈ పేరు మన దేశంలో చాల మందికి సుపరిచయమే. ముఖ్యంగా సామాజిక సేవారంగంలో ఉన్నవారికి బాబా ఆమ్టే ప్రేరణ, స్పూర్తి దాత. మానవ సేవకు పర్యాయ పదంగా మారిన మదర్ తెరీసా మహనీయురాలు. ఇటివలి కాలంలో ఆమె చేసిన సేవకు మరెవ్వరు సరి కారు. అయినా బాబా ఆమ్టే చేసిన సేవలు చాలా గొప్పవి.

1983 వ సంవత్సరంలో నేను అనంతపురంలో L L B చదవుతున్నప్పుడు The Week వార పత్రిక - బాబా ఆమ్టే గారి గురించిన ప్రత్యేక సంచికను విడుదల చేసింది. కుష్టు రోగులకు అయన చేస్తున్న సేవలు, వరోరలోని "ఆనందవన్" గురించి చదవుతుంటే కళ్ళు తడి అయ్యాయి. అత్యధికులు అసహ్యించుకునే కుష్టు రోగులను అయన దగ్గరకు తీసుకుని సేవ చేస్తున్న తీరు నన్ను అబ్బుర పరచింది.  మదర్ తెరీసా తర్వాత మన దేశంలో బాబా ఆమ్టే నిస్వార్థ సేవాపరాయునిడిగా నా మనసులో ముద్ర పడిపోయాడు. మదర్ తెరీసా, బాబా ఆమ్టేలు సేవారంగంలో స్పూర్తి ధాతలయ్యారు.

1984 లో  L L B చదువును మధ్యలోనే వదిలేశాను. మానవ సేవే మాధవ సేవ అన్న శ్రీ వివేకానందుల వారి సూక్తిని అక్షర సత్యం చేస్తున్న బాబా ఆమ్టే పట్ల ఆకర్షితున్నై ఆనందవన్ లో స్థిరపడాలన్న నా ఆకాంక్షను జులై, ఆగష్టులలో ఆయనకు లేఖల ద్వారా తెలిపాను, అక్కడికి రమ్మని అయన తరపున లేఖ రాగా, ఆకస్మికంగా శ్రీ రామారావు పదివిచ్యుతుడు కావడంతో చెలరేగిన అల్లర్ల్లలో అనేక రైళ్ళు రద్దయ్యాయి. ఈ కారణంగా నా ప్రయాణం కూడా వాయిదాపడి ఆగష్టు నెల చివర్లో ఆనందవన్ చేరుకున్నాను.

అది నూటికి నూరు పాళ్ళూ ఆనందవనమే. అక్కడ కుష్టు రోగులకు అయన  కల్పించిన వసతులు, ప్రోత్సాహం, పనులు వారి జీవితాలలో ఉహించ లేనంత సంతోషం నింపాయి, వీటికి కారకుడైన బాబా ఆమ్టే వారి పాలిట ప్రత్యక్ష దైవం! విశ్రాంత IAS అధికారి దాదా లొక్రే ఇంటి ప్రక్క గదులను నాకు కేటాయించారు, అందరి భోజనాలు సామూహిక భోజన హాలునందే. బాబా ఆమ్టే స్వయంగా వడ్డించేవారు, వెన్నెముక సమస్యల వలన అయన కూర్చునే వారు కాదు.

బాబా ఆమ్టే, దాదా లొక్రే గార్లు రెండు రోజులలో పలుసార్లు నాతో మాట్లాడి - నేను నా తల్లిదండ్రుల నుండి అనుమతి పత్రం తీసుకరానందున వారు ఎప్పుడైనా నా కోసం ఆనందవన్ కు వచ్చి కంట తడి పెడితే తాము తప్పకుండా నన్ను వారి వెంట పంపుతామన్నారు. పేరెంట్స్, బ్రదర్స్ కోరిక మేరకు IAS పరిక్షలు వ్రాయమన్నారు, ఒకవేళ అది రాకుంటే సేవ చేయడానికి వీలైన వృత్తిని, పనిని చేపట్టమని నాకు నచ్చ చెప్పారు. రైలు అందుకోవడానికి మామూలు కంటే ముందుగా భోజనం చేయవలసి వచ్చినందున బాబా ఆమ్టే స్వయంగా నన్ను భోజనశాలకు తీసుక వెళ్ళి వడ్డించి, రైల్వే స్టేషన్ కు ఒక రిక్షా ఏర్పాటు చేసి శుభాశిష్యులతో వీడ్కోలు చెప్పారు. ఆ రెండు రోజులు నా జీవితంలో ఎప్పటికి మరువలేనివి.

బాబా ఆమ్టే సలహా మేరకు 1985-1986 లో సివిల్స్ మెయిన్స్ వ్రాసాను, అయితే Dr RAU సూచించినట్లు కాకుండా కష్టమైన PHILOSOPHY తీసుకుని ఇంటర్వ్యూకు అర్హత పొంద లేదు. గ్రూప్ 1 & 2 పరిక్షల పట్ల ఆసక్తి లేక జర్నలిజం కోర్సు చేసి కొంత కాలం ఆంధ్ర ప్రభ లో Sub- Editor గా పని చేసి, రాజీనామా చేసి వైద్య వృత్తిని ఎంచుకుని ఇందులో సంతృప్తిని పొందుతూ మరింత మందికి ఉపయోగ పడేలా నా వైద్య మిత్రులతో కలిసి ఈ బ్లాగులు ఆరంబించాను. నేను మొదట చదివినది M. Com, తర్వాత ఇలా వైద్య వృత్తిలో స్థిరపడటానికి పరోక్ష కారకులు బాబా ఆమ్టే. ఆయనకు కృతజ్ఞతలు.

మీకందరికీ ఆరోగ్యము,  సంతోషం, ప్రశాంతత & దివ్యానందం  చేకూరాలని ఆశిస్తూ.
డాక్టర్ ఆర్. యస్. ఈశ్వర్ రెడ్డి